ఫేస్‌బుక్‌కు షాక్‌: కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌

ఫేస్‌బుక్‌ డేటా బ్రీచ్‌ నేపథ్యంలో కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం రంగంలోకి వస్తోంది. ఆర్కుట్‌ ఫౌండర్‌ ఆర్కుట్‌ బ్యూకుక్టన్ ఈ సంచలన ప్రకటన చేశారు. ‘హలో’ పేరుతో భారతీయ సోషల్‌ మీడియా మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించారు. బ్రెజిల్లో దీన్ని 2016,జూలైలో ప్రారంభించాము ..భారత మార్కెట్లో సుమారు 35,000 మంది వినియోగదారులు తమ బీటా టెస్టింగ్లో భాగంగా ఉన్నారనీ ఆయన ప్రకటించారు. మరోసారి భారతదేశానికి హలో చెప్పడానికి ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. హలో యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లేలలో డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. అంతేకాదు ఆదాయం పొందడానికి యూజర్ డేటాని విక్రయించాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. థర్డ్‌ పార్టీ పార్టీలకు తమ యూజర్ల డాటా షేర్‌ చేయమని హామీ ఇచ్చారు.

2014 లో ఆర్కుట్‌ మూసివేసిన ఇపుడు మళ్లీ రంగంలోకి వస్తోంది. 2004లో సామాజిక మాధ్యమ విప్లవానికి తెరలేపిన ‘ఆర్కుట్‌ ’ సృష్టికర్త ఆర్కుట్‌ బ్యూకుక్టన్‌. టర్కీకి చెందిన అతను గూగుల్‌లో పనిచేస్తున్న సమయంలోనే ‘ఆర్కుట్‌’ను రూపొందించారు. అప్పట్లో ఆర్కుట్‌ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇదే తరహాలో అదే ఏడాదిలో ప్రారంభమైన ఫేస్‌బుక్‌ ఎంతలా దూసుకెళిపోతోందో చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్‌ మాజీ ఉద్యోగులైన కొంత మంది స్నేహితులతో కలిసి ఇప్పటికే ‘హలో’ని కెనడా, న్యూజీలాండ్‌, బ్రెజిల్‌…. ఇలా 12 దేశాల్లో ప్రారంభించారు.

కాగా సోషల్ నెట్వవర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌కు దేశంలో దాదాపు 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే కేంబ్రిడ్జ్ ఎనలిటికాలో పాల్గొన్న గ్లోబల్ డేటా ఉల్లంఘన వల్ల దేశంలోని దాదాపు 5.62 లక్షల మంది డేటా లీక్‌ అయిందని స్వయంగా జుకర్‌ బర్గ్‌ ఒప్పుకున్నారు. మరోవైపు అమెరికా కాంగ్రెస్‌ముందు విచారణకు హాజరైన జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ నిర్వహణలో చాలా తప్పులు జరిగాయనీ, క్షమించాలని కోరారు.

రాజస్తాన్‌ రాయల్స్‌ బోణీ

జైపూర్‌: పేలవ ఆటతీరుతో తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన రాజస్తాన్‌ రాయల్స్‌… సొంత గడ్డపై వరుణుడి అండతో ఢిల్లీపై 10 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది. వర్షం కారణంగా 6 ఓవర్లకు 71 పరుగులుగా కుదించిన లక్ష్యాన్ని డేర్‌డెవిల్స్‌ అందుకోలేకపోయింది. ఆ జట్టు 6 ఓవర్లలో 4 వికెట్లకు 60 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్‌… 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసిన సమయంలో వాన అంతరాయం కలిగించింది.

చాలాసేపటి తర్వాత మ్యాచ్‌ మొదలుకాగా… డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం డేర్‌ డెవిల్స్‌ లక్ష్యాన్ని 6 ఓవర్లకు 71గా నిర్దేశించారు. అయితే… విధ్వంసక ఓపెనర్‌ మున్రో (0) తొలి బంతికే రనౌట్‌ కావడం, మ్యాక్స్‌వెల్‌ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (14 బంతుల్లో 20; 3 ఫోర్లు) ధాటిగా ఆడలేకపోవడంతో లక్ష్యానికి ఢిల్లీ మరో 11 పరుగుల దూరంలోనే ఆగిపోయింది. అంతకుముందు రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో కెప్టె న్‌ రహానే (40 బంతుల్లో 45, 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సంజు శామ్సన్‌ (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జాస్‌ బట్లర్‌ (18 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొద్దిసేపు మెరిపించారు.

ఇచ్చాడయ్యో…హామీ

భరత్‌ అనే నేను’లో ‘వచ్చాడయ్యో సామీ..’ అనే పాట చాలా పాపులర్‌ అయిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నెల 20న ఈ చిత్రం విడుదల కానుంది. నెక్ట్స్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేశ్‌ ఎప్పుడో హామీ ఇచ్చేశారు. ఇప్పుడు మరో సినిమాకి హామీ ఇచ్చారు. మహేశ్‌బాబు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. నాలుగేళ్ల క్రితం మహేశ్‌బాబుతో ‘1 నేనొక్కడినే’ వంటి క్లాస్‌ అండ్‌ డీసెంట్‌ మూవీని తెరకెక్కించిన సుకుమార్‌ ఈ చిత్రానికి దర్శకుడని సమాచారం.

వారంలోపు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, మహేశ్‌తో సుకుమార్‌కి ఇది రెండో సినిమా అయితే ‘రంగస్థలం’ తర్వాత ఇమీడియట్‌గా మైత్రీతో కూడా సుకుమార్‌కి ఇది రెండో సినిమా అవుతుంది. వంశీ పైడిపల్లితో చేయనున్న సినిమా, సుకుమార్‌తో చేయనున్న సినిమా షూటింగ్స్‌ కొంచెం అటూ ఇటూగా జరుగుతాయట. సో.. రానున్న రోజుల్లో ఈ రెండు చిత్రాలతో మహేశ్‌ ఫుల్‌ బిజీ అన్నమాట. ప్రస్తుతం మహేశ్‌బాబు స్మాల్‌ ట్రిప్‌ కోసం ఫారిన్‌ వెళ్లారని సమాచారం