ముంబైపై ‘విన్‌’ రైజర్స్‌

సొంతగడ్డపై అంచనాలను నిలబెట్టుకుంటూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో కడవరకూ ఆసక్తికరంగా సాగిన పోరులో హైదరాబాద్‌ వికెట్‌ తేడాతో గెలుపును అందుకుంది. బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌(45; 28 బంతుల్లో 8 ఫోర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, దీపక్‌ హుడా(32 నాటౌట్‌; 25 బంతుల్లో 1 ఫోర్‌ 1 సిక్స్‌) సమయోచిత ఇన‍్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

తొలుత బౌలింగ్‌లో విశేషంగా రాణించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు.. ముంబైను 147 పరుగులకే పరిమితం చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ను శిఖర్‌ ధావన్‌, వృద్ధిమాన సాహాలు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 6.5 ఓవర్లలో 62 పరుగులు జోడించిన తర్వాత సాహా(22) ఔటయ్యాడు. ఆపై కొద్దిపాటి వ్యవధిలోనే కేన్‌ విలియమ్సన్‌(6) నిరాశపరచగా, ధాటిగా ఆడుతున్న శిఖర్‌ ధావన్‌ కూడా పెవిలియన్‌ చేరాడు.

దాంతో హైదరాబాద్‌ 77 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు తర్వాత మనీష్‌ పాండే(11), షకిబుల్‌ హసన్‌(12)లు ఔట్‌ కావడంతో హైదరాబాద్‌ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆ తరుణంలో దీపక్‌ హుడా, యూసఫ్‌ పఠాన్‌లు ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టారు. అయితే పఠాన్‌(14) కీలక సమయంలో అవుట్‌ కావడంతో పాటు ఆపై మరుసటి బంతికే రషీద్‌ ఖాన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. 19 ఓవర్‌లో సిద్ధార్ధ్‌ కౌల్‌, సందీప్‌ శర్మలు సైతం పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరడంతో హైదరాబాద్‌ 137 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఇక చివర్‌ ఓవర్‌లో విజయానికి 11 పరుగులు కావాల్సిన తరుణంలో హుడా తొలి బంతిని సిక్స్‌ కొట్టగా, రెండో బంతి వైడ్‌ అయ్యింది. ఆ తర్వాత రెండో బంతికి పరుగు రాకపోగా, మూడో బంతికి పరుగు వచ్చింది. నాల్గో బంతిని స్టాన్‌లేక్‌ సింగిల్‌ తీసి హుడాకు స్టైకింగ్‌ ఇచ్చాడు. ఇక ఐదో బంతికి మరో సింగిల్‌ రాగా, చివరి బంతిని స్టాన్‌ లేక్‌ ఫోర్‌ కొట్టి విజయాన్ని అందించాడు.

అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్‌రైజర్స్‌ బౌలర్లు ధాటిగా బౌలింగ్‌ చేయడంతో ముంబై ఇండియన్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ముంబై ఆటగాళ్లలో ఎవిన్‌ లూయిస్‌(29), కీరోన్‌ పొలార్డ్‌(28), సూర్యకుమార్‌ యాదవ్‌(28)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, రోహిత్‌ శర్మ(11), కృనాల్‌ పాండ్యా(15)లు నిరాశపరిచారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో స్టాన్‌లేక్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ తలో రెండు వికెట్లు సాధించగా, రషీద్‌ ఖాన్‌, షకిబ్‌ వుల్‌ హసన్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

టాస్‌ గెలిచిన హైదరాబాద్‌.. ముంబైను ముందుగా బ్యాటింగ్‌ ఆహ్వానించింది. దాంతో ముంబై ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఎవిన్‌ లూయిస్‌లు ఆరంభించారు. అయితే మ్యాచ్‌ రెండో ఓవర్‌లోనే స్టాన్‌లేక్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ పెవిలియన్‌కు చేరాడు. ఫస్ట్‌ డౌన్‌ వచ్చిన ఆటగాడు ఇషాన్‌ కిషాన్‌(9) కూడా విఫలమయ్యాడు. అయితే కాసేపు లూయిస్‌ మెరుపులు మెరిపించాడు. మూడు ఫోర్లు, రెండు సిక‍్సర్లతో ముంబై అభిమానుల్ని అలరించాడు. కాగా, జట్టు స్కోరు 54 పరుగుల వద్ద లూయిస్‌ అవుట్‌ కావడంతో ముంబై స్కోరులో వేగం తగ్గింది. ఆపై కీరోన్‌ పొలార్డ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు బ్యాట్‌ ఝుళిపించే యత్నం చేసినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. దాంతో ముంబై ఇండియన్స్‌ భారీ స్కోరు చేయలేకపోయింది.

మెగా హీరోతో కమిటయ్యాడు

టాలీవుడ్ లో బడా ఫ్యామిలీ నుంచి హీరోలు పరిచయమై చాలా కాలమవుతోంది. ఇప్పటికే నాలుగైదు ఫ్యామిలీల నుంచి కొంతమంది వరుసపెట్టి అవకాశాలు అందుకొని హీరోలుగా మంచి సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే మెగా ఫ్యామిలి నుంచి కూడా ఒక యువకుడు గత కొంత కాలంగా సినిమాల్లోకి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను ఎవరో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్.

2 వేల జేఎల్‌ఎం కొలువులు

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌)లో ఖాళీగా ఉన్న 2 వేల జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టులను రెండు విడతల్లో భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. తొలి విడతగా వచ్చే నెల తొలి వారంలో 1,000 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయనుంది. పోస్టుల భర్తీ ప్రతిపాదనలను ఈ నెలాఖరులో నిర్వహించే బోర్డు సమావేశంలో ఆమోదించాక వచ్చే నెల తొలి వారంలో నియామక ప్రకటన జారీ చేస్తామని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి. రఘుమారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

మహిళా అభ్యర్థులకు అవకాశం!
జేఎల్‌ఎం పోస్టుల భర్తీలో తొలిసారిగా మహిళా కోటా అమలుచేసే అంశాన్ని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిశీలిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా జేఎల్‌ఎంలు విద్యుత్‌ స్తంభాలు ఎక్కి పని చేయాల్సి ఉండనుండటంతో ఇప్పటివరకు ఈ పోస్టుల భర్తీలో మహిళలకు అవకాశం కల్పించలేదు. అయితే జేఎల్‌ఎం పోస్టుల భర్తీలో సైతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని మహిళా నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇటీవల ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి ప్రకటన జారీచేయగా గణనీయ సంఖ్య లో మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తులను సంస్థ యాజమాన్యం తిరస్కరించడంతో కొందరు మహిళా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకొని రాత పరీక్షకు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలో త్వరలో జారీ చేయనున్న జేఎల్‌ఎం పోస్టుల నియామకాల్లో మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించే అంశాన్ని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ యాజమాన్యం పరిశీలిస్తోంది. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహాను కోరింది. మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించే అంశంపై సంస్థ యాజమాన్యం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపిక ప్రక్రియలో భాగమైన విద్యుత్‌ స్తంభాలు ఎక్కడంలో నైపుణ్యాన్ని పరిశీలించే పరీక్షను మహిళా అభ్యర్థులు సైతం నెగ్గాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యుత్‌ స్తంభాలు ఎక్కి మరమ్మతు పనులు చేయడం జేఎల్‌ఎం విధుల్లో అత్యంత ప్రధానమైన విధిగా అధికారులు తెలిపారు.

నేడు ఇంటర్‌ ఫలితాలు విడుదల

: ఇంటర్‌ ఫలితాలను శుక్రవారం విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఇంటర్‌ బోర్డు కార్యాలయ ఆవరణలో ఉదయం 9 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 14వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,63,546 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 4,55,635 మంది ఫస్టియర్‌ కాగా.. 5,07,911 మంది సెకండియర్‌ విద్యార్థులున్నారు. ‘టీఎస్‌బీఐఈ సర్వీసెస్‌’ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు తమ కాలేజీల వారీ ఫలితాలను తమ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉపయోగించి http://admi.tsbie.cgg.gov. in వెబ్‌సైట్‌లో పొందవచ్చు.