బెంగళూరు బోణీ… 

ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓడిన కోహ్లి సేన వెంటనే కోలుకుంది. సొంత మైదానంలో కీలక విజయంతో పాయింట్ల బోణీ చేసింది. శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (30 బంతుల్లో 47; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, రవిచంద్రన్‌ అశ్విన్‌ (21 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఉమేశ్‌ యాదవ్‌ 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రాయల్‌ చాలెంజర్స్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌ (40 బంతుల్లో 57 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, డి కాక్‌ (34 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. అశ్విన్‌కు 2 వికెట్లు దక్కాయి. 2018 ఐపీఎల్‌లో వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లోనూ టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవడం విశేషం.

రాహుల్‌ మినహా…
వోక్స్‌ వేసిన తొలి ఓవర్లో రాహుల్‌ రెండు వరుస సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టడంతో 16 పరుగులు… తర్వాతి రెండు ఓవర్లలో మయాంక్‌ (15) మూడు ఫోర్లు బాదడంతో మూడు ఓవర్లు ముగిసేసరికి స్కోరు 32/0… ఈ జోరు చూస్తే పంజాబ్‌ను ఆపడం కష్టమనిపించింది. కానీ ఉమేశ్‌ యాదవ్‌ వేసిన నాలుగో ఓవర్‌ ఆట దిశను మార్చేసింది. తొలి రెండు బంతుల్లో అగర్వాల్, ఫించ్‌ (0)లను అవుట్‌ చేసిన ఉమేశ్‌…చివరి బంతికి యువరాజ్‌ సింగ్‌ (4)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఎల్బీడబ్ల్యూకు వ్యతిరేకంగా ఫించ్‌ రివ్యూ కోరినా లాభం లేకపోగా, 141 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతికి యువీ వద్ద జవాబు లేకపోయింది. ఈ దశలో రాహుల్, కరుణ్‌ నాయర్‌ (26 బంతుల్లో 29; 3 ఫోర్లు) కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆర్‌సీబీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగుల వేగం తగ్గింది. ఇలాంటి స్థితిలో కెప్టెన్‌ అశ్విన్‌ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే చహల్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి భారీ షాట్‌తో సిక్సర్‌ బాదిన అశ్విన్, తర్వాతి బంతికి అదే తరహాలో ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. ముజీబ్‌ (0)ను వోక్స్‌ అవుట్‌ చేయడంతో పంజాబ్‌ నాలుగు బంతులు ఉండగానే ఆలౌట్‌ అయింది. ఈ సీజన్‌లో ఒక జట్టు ఆలౌట్‌ కావడం ఇదే తొలిసారి.

ఏబీ మెరుపులు…
రెండో బంతికే బ్రెండన్‌ మెకల్లమ్‌ (0)ను అవుట్‌ చేసి అక్షర్‌ తమ జట్టుకు శుభారంభం అందించాడు. ఐదో ఓవర్లో బెంగళూరుకు అసలు షాక్‌ తగిలింది. 17 ఏళ్ల అఫ్ఘన్‌ కుర్రాడు ముజీబుర్‌ రహమాన్‌ అద్భుతమైన గుగ్లీతో విరాట్‌ కోహ్లి (16 బంతుల్లో 21; 4 ఫోర్లు)ని క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో చిన్నస్వామి మైదానం ఒక్కసారిగా చిన్నబోయింది. ఈ దశలో డి కాక్, డివిలియర్స్‌ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 39 బంతుల్లోనే 54 పరుగులు జత చేశారు. అయితే అశ్విన్‌ వరుస బంతుల్లో డి కాక్, సర్ఫరాజ్‌ (0)లను అవుట్‌ చేసి పంజాబ్‌లో ఆశలు రేపాడు. అయితే ఏబీ దూకుడైన బ్యాటింగ్‌ జట్టును విజయానికి చేరువ చేసింది. 35 బంతుల్లోనే అతను అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగు బంతుల వ్యవధిలో డివిలియర్స్, మన్‌దీప్‌ (19 బంతుల్లో 22; 1 ఫోర్‌) అవుటైనా… మోహిత్‌ ఓవర్లో సుందర్‌ (9 నాటౌట్‌) రెండు ఫోర్లు కొట్టి మూడు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు.

7 ఐపీఎల్‌లో ఏడు జట్ల తరఫున ఆడిన తొలి ఆటగాడిగా ఆరోన్‌ ఫించ్‌ అరుదైన ఘనత సాధించాడు. అతను రాజస్థాన్, ఢిల్లీ, పుణే వారియర్స్, సన్‌రైజర్స్, ముంబై, గుజరాత్, పంజాబ్‌ జట్లకు ఆడాడు. పార్థివ్, దినేశ్‌ కార్తీక్, తిసార పెరీరా ఆరేసి జట్లకు ప్రాతినిధ్యం వహించారు.

నాలుగు భాషల్లో ‘రంగస్థలం’

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా రంగస్థలం. ఇప్పటికే వందకోట్ల షేర్‌ మార్కును దాటి దూసుకుపోతున్న ఈ సినిమా విజయోత్సవ వేడుకను ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార‍్యక్రమానికి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హజరవుతున్నారు. తాజాగా రంగస్థలం సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే.., రామ్‌ చరణ్‌ తమిళ్‌లోకి అనువాదం చేసే ఆలోచన ఉన్నట్టుగా తెలిపారు.

అయితే తాజా సమాచారం ప్రకారం రంగస్థలం సినిమాను తమిళ్‌తో పాటు మరో మూడు భాషల్లోకి అనువదించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. తమిళ్‌తో పాటు మలయాళం, హిందీ, భోజ్‌పురి భాషల్లోకి కూడా అనువదించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. త్వరలోనే డబ్బింగ్‌ వర్షన్‌ల రిలీజ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రామ్‌ చరణ్‌ సరసన సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, అనసూయ, జగపతి బాబు, ప్రకాష్‌ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

స్కిన్‌ కోసం ‘స్మార్ట్‌’గా!

భగభగమండే ఎండలు బయటకు వెళ్లాలంటే భయపడేలా చేస్తున్నాయి. ఎందుకంటే మామూలు రోజుల్లో కంటే సూర్యుడి కిరణాల నుంచి వెలువడే అలా్ట్రవయొలెట్‌ రేడియేషన్‌ ప్రభావం ఈ వేసవిలో మరింత ఎక్కువగా ఉంటుంది. అయినా వెళ్లకుండా మాత్రం ఉండలేం. అసలే వస్తున్నది సెలవుల సీజన్‌. ఇప్పటికే ట్రిప్స్‌ షెడ్యూల్‌ పక్కాగా పూర్తయిపోయి ఉంటుంది. మరి ఏం చేయాలి? ఎండ నుంచి ఎలా రక్షణ పొందాలి? అందుకే ప్లే స్టోర్‌లో మీ కోసం ఓ యాప్‌ రెడీగా ఉంది. పేరు ‘యూవీ లెన్స్‌’. ఇది మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఎండ నుంచి చర్మాన్ని ఎలా రక్షించుకోవాలో చెప్పే గైడ్‌గా ఉంటుంది. ఈ యాప్‌ ఓపెన్‌ చేయగానే ముందుగా వాతావరణాన్ని అంచనా వేస్తుంది. యూవీ రేడియేషన్‌ ప్రభావం ఎంత ఉందో చెబుతుంది. మీ చర్మం ఎప్పుడు హానికి గురవుతుందో కూడా చెబుతూ ఉంటుంది. అలాగే, ఈ ఎండాకాలంలో సన్‌స్ర్కీన్‌ లోషన్‌ తప్పనిసరి. బయట వాతావరణాన్ని బట్టిలోషన్‌ను ఎప్పుడెప్పుడు వినియోగించాలో కూడా అలర్ట్స్‌ ఇవ్వడం ఈ యాప్‌లోని మరో విశేషం.

అసలు సిసలు స్త్రీవాది

మహిళల విముక్తే మానవ జాతి విముక్తి’ అంటారు అంబేడ్కర్‌. రాజకీయ, సామాజిక ఆర్థిక అసమానతలో పాటు లింగ వివక్ష దేశాన్ని పట్టిపీడిస్తోందనీ స్త్రీపురుష సమానత్వం మాత్రమే సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలదనీ ఆయన మనసా వాచా నమ్మారు. అసమానతలను తరిమికొట్టేందుకు రాజ్యాంగ రచనను ఒక సమున్నతావకాశంగా అంబేడ్కర్‌ భావించారు. ఆర్టికల్‌ 14 నుంచి 16 వరకు స్త్రీపురుష సమానత్వాంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. అంతేకాకుండా స్త్రీల రక్షణకు ఉద్దేశించిన అనేక చట్టాలకు ఆయన రూపకల్పన చేశారు. అందులో భాగమే.. జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు న్యాయ శాఖా మంత్రి హోదాలో అంబేడ్కర్‌ ప్రవేశపెట్టిన హిందూ కోడ్‌ బిల్‌. భారత స్వతంత్య్రానంతర తొలి న్యాయ శాఖా మంత్రి అయిన అంబేడ్కర్‌.. వివాహం, విడాకులు, సంపద హక్కుతో పాటు సంరక్షణ హక్కులకు హామీ యిచ్చే హిందూ కోడ్‌ బిల్లుని ప్రవేశపెట్టడం ద్వారా స్త్రీల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులను ఆశించారు. అయితే ఈ బిల్లు ఆమోదం పొందకుండా నెహ్రూ ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తిరస్కరిస్తూ న్యాయ శాఖా మంత్రి పదవినే తృణప్రాయంగా వదులుకున్న ఘనత డాక్టర్‌. బిఆర్‌ అంబేడ్కర్‌కే దక్కుతుంది.

డీజిల్‌ గుబేల్‌.. !

తెలుగు రాష్ట్రాల్లో టాప్‌ గేర్‌లో దూసుకుపోతున్నాయి. హైదరాబాద్‌లో డీజిల్‌ ధర ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకుంది. పెట్రోల్‌ కూడా దానిని అనుసరిస్తూ భగ్గుమంటోంది. రోజు వారీ ధరల సవరణ పేరిట పెట్రో ధరలను పైసా.. పైసా పెంచుతున్న చమురు సంస్థలు.. వినియోగదారునిపై సైలెంట్‌గా బాదేస్తున్నాయి.

ఈ నెల మొదట్లో డీజిల్‌ ధరను లీటర్‌కు మూడు నుంచి 19 పైసల చొప్పున పెంచిన ఆయిల్‌ కంపెనీలు.. రెండు రోజుల క్రితం మూడు పైసలు తగ్గించాయి. మళ్లీ ఇప్పుడు డీజిల్‌ ధర తారస్థాయికి చేరింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.70.58కు చేరింది. ఇక లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.78.27గా ఉంది.

పక్షం నుంచి రోజులకు..
గతేడాది వరకు ప్రతి పక్షం రోజులకోసారి పెట్రో ధరలు సమీక్షించిన చమురు సంస్థలు.. గత జూన్‌ నుంచి ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ఏ రోజుకు ఆ రోజు ధరలను నిర్ణయిస్తున్నాయి. నూతన విధానం అమల్లోకి వచ్చిన తొలి పక్షం రోజులూ ధరలు తగ్గగా.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రోజువారీగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచొద్దని చమురు సంస్థలకు సూచనలు జారీ చేసింది. చమురు సంస్థలు మాత్రం కేంద్రం ఆదేశాలు తమకు అందలేదని చెపుతూ ధరలను పెంచుతున్నాయి.

డీజిల్‌ రూ.70.58.. పెట్రోల్‌ రూ.78.27
తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో డీజిల్‌ ధర మోతెక్కుతోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం లీటర్‌ డీజిల్‌ ధర రూ.70.58గా ఉంది. రోజువారీ ధరల సవరణ విధానం ప్రారంభమైన సమయంలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.59.30గా ఉంది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ అక్టోబర్‌ నాటికి రూ.64.02కి చేరింది. మార్చి నెలఖారులో రూ.69.97కు పెరిగింది.

ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర ప్రస్తుతం రూ.78.27గా ఉంది. గత జూన్‌లో రూ.69.56గా ఉన్న పెట్రోల్‌ ధర ఆ తర్వాత రోజువారీ ధర సవరణలతో పైసా పైసా పెరిగుతూ వచ్చింది. గత నెలఖారులో రూ.77.89గా ఉంటే.. ఈ నెలలో రూ.78.36 వరకు పెరిగి ఆ తర్వాత హెచ్చుతగ్గులతో కొనసాగుతోంది. పెట్రో ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణా చార్జీల బాదుడు కూడా తోడవుతోంది. తెలుగు రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ విధింపులో దేశంలోనే రెండో స్థానంలో ఉండటం గమనార్హం