బెంగళూరు బోణీ… 

ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో ఓడిన కోహ్లి సేన వెంటనే కోలుకుంది. సొంత మైదానంలో కీలక విజయంతో పాయింట్ల బోణీ చేసింది. శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (30 బంతుల్లో 47; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, రవిచంద్రన్‌ అశ్విన్‌ (21 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఉమేశ్‌ యాదవ్‌ 23 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రాయల్‌ చాలెంజర్స్‌ 19.3 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌ (40 బంతుల్లో 57 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, డి కాక్‌ (34 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. అశ్విన్‌కు 2 వికెట్లు దక్కాయి. 2018 ఐపీఎల్‌లో వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లోనూ టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవడం విశేషం.

రాహుల్‌ మినహా…
వోక్స్‌ వేసిన తొలి ఓవర్లో రాహుల్‌ రెండు వరుస సిక్సర్లు, ఒక ఫోర్‌ కొట్టడంతో 16 పరుగులు… తర్వాతి రెండు ఓవర్లలో మయాంక్‌ (15) మూడు ఫోర్లు బాదడంతో మూడు ఓవర్లు ముగిసేసరికి స్కోరు 32/0… ఈ జోరు చూస్తే పంజాబ్‌ను ఆపడం కష్టమనిపించింది. కానీ ఉమేశ్‌ యాదవ్‌ వేసిన నాలుగో ఓవర్‌ ఆట దిశను మార్చేసింది. తొలి రెండు బంతుల్లో అగర్వాల్, ఫించ్‌ (0)లను అవుట్‌ చేసిన ఉమేశ్‌…చివరి బంతికి యువరాజ్‌ సింగ్‌ (4)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఎల్బీడబ్ల్యూకు వ్యతిరేకంగా ఫించ్‌ రివ్యూ కోరినా లాభం లేకపోగా, 141 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతికి యువీ వద్ద జవాబు లేకపోయింది. ఈ దశలో రాహుల్, కరుణ్‌ నాయర్‌ (26 బంతుల్లో 29; 3 ఫోర్లు) కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆర్‌సీబీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగుల వేగం తగ్గింది. ఇలాంటి స్థితిలో కెప్టెన్‌ అశ్విన్‌ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే చహల్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి భారీ షాట్‌తో సిక్సర్‌ బాదిన అశ్విన్, తర్వాతి బంతికి అదే తరహాలో ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. ముజీబ్‌ (0)ను వోక్స్‌ అవుట్‌ చేయడంతో పంజాబ్‌ నాలుగు బంతులు ఉండగానే ఆలౌట్‌ అయింది. ఈ సీజన్‌లో ఒక జట్టు ఆలౌట్‌ కావడం ఇదే తొలిసారి.

ఏబీ మెరుపులు…
రెండో బంతికే బ్రెండన్‌ మెకల్లమ్‌ (0)ను అవుట్‌ చేసి అక్షర్‌ తమ జట్టుకు శుభారంభం అందించాడు. ఐదో ఓవర్లో బెంగళూరుకు అసలు షాక్‌ తగిలింది. 17 ఏళ్ల అఫ్ఘన్‌ కుర్రాడు ముజీబుర్‌ రహమాన్‌ అద్భుతమైన గుగ్లీతో విరాట్‌ కోహ్లి (16 బంతుల్లో 21; 4 ఫోర్లు)ని క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో చిన్నస్వామి మైదానం ఒక్కసారిగా చిన్నబోయింది. ఈ దశలో డి కాక్, డివిలియర్స్‌ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 39 బంతుల్లోనే 54 పరుగులు జత చేశారు. అయితే అశ్విన్‌ వరుస బంతుల్లో డి కాక్, సర్ఫరాజ్‌ (0)లను అవుట్‌ చేసి పంజాబ్‌లో ఆశలు రేపాడు. అయితే ఏబీ దూకుడైన బ్యాటింగ్‌ జట్టును విజయానికి చేరువ చేసింది. 35 బంతుల్లోనే అతను అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగు బంతుల వ్యవధిలో డివిలియర్స్, మన్‌దీప్‌ (19 బంతుల్లో 22; 1 ఫోర్‌) అవుటైనా… మోహిత్‌ ఓవర్లో సుందర్‌ (9 నాటౌట్‌) రెండు ఫోర్లు కొట్టి మూడు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు.

7 ఐపీఎల్‌లో ఏడు జట్ల తరఫున ఆడిన తొలి ఆటగాడిగా ఆరోన్‌ ఫించ్‌ అరుదైన ఘనత సాధించాడు. అతను రాజస్థాన్, ఢిల్లీ, పుణే వారియర్స్, సన్‌రైజర్స్, ముంబై, గుజరాత్, పంజాబ్‌ జట్లకు ఆడాడు. పార్థివ్, దినేశ్‌ కార్తీక్, తిసార పెరీరా ఆరేసి జట్లకు ప్రాతినిధ్యం వహించారు.

Advertisements

One thought on “బెంగళూరు బోణీ… 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s