పవన్‌కు శ్రీరెడ్డి సూటి ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై స్పందించారు. కథువా, ఉన్నావ్‌ అత్యాచార ఘటనలను నిరసిస్తూ శనివారం నెక్లెస్‌రోడ్డు వద్ద జనసేన చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీరెడ్డి తీరును తప్పుబట్టారు. టాలీవుడ్‌లో జరుగుతున్న కాస్టింగ్‌ కౌచ్‌పై నిరసనగా ఆమె స్పందించిన తీరు ముమ్మాటికీ సరికాదన్నారు. ఏదైనా వివాదం ఉంటే, వేధింపులు ఎదుర్కొని ఉంటే చట్టపరంగా ముందుకు వెళ్లాలని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతేకానీ అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం, టీవీ ఛానెళ్లకు వెళ్లి ఫొటోలు, వీడియోలు లీక్‌ చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో మీడియా సెన్సేషనలిజం తప్ప సాధించేది ఏదీ లేదని అన్నారు.

అయితే పవన్‌ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందించారు. ‘పవన్‌ కల్యాణ్‌జీ ఆంధ్రప్రదేశ్‌ కోసం మీరు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం కోర్టుకు లేదా పోలీస్‌ స్టేషన్‌కు ఎందుకు వెళ్లలేదు. మేమూ కూడా అంతే. టాలీవుడ్‌లోని కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలుగు అమ్మాయిల పట్ల మీకు కనీసం గౌరవం కూడా లేదు. మీరు బలవంతంగా నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము మిమ్మల్ని అర్థం చేసుకుంటాం. అమ్మాయిలు పవన్‌ కల్యాణ్‌ మద్దతును ఎప్పుడూ అడగొద్దు. సినిమా పరిశ్రమపై అసహ్యం వేస్తోంది’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.

కలెక్షన్స్‌ పట్టించుకోకపోతే క్రైమ్‌

మహేశ్‌బాబుతో…

వీలైతే ప్రేమిద్దాం. పోయేదేముంది. తిరిగి ప్రేమిస్తారు. మనకు ఎంతో ఇచ్చిన ఊరికి తిరిగి ఇచ్చేయకపోతే లావయిపోతాం.మొక్కలతో పాటు మనుషులను కూడా కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుంది.జస్ట్‌ ఒకే వాక్యం. కానీ అర్థం బోలెడు. ‘థాట్‌ ప్రొవోకింగ్‌’ వర్డ్స్‌. మనసుకి ఇట్టే పట్టేసేపదాలు. అందుకే మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌ ప్రేక్షకుల మనసుల్లోకి చొచ్చుకువెళ్లాయి. ఇప్పుడు కొరటాల శివ ఇంకో మాట చెప్పారు. ‘ప్రామిస్‌ నిలబెట్టుకోవాలని’. మహేశ్‌బాబు హీరోగా ఆయన తెరకెక్కించిన‘భరత్‌ అనే నేను’ లైన్‌ ఇదే. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.

సన్‌రైజర్స్‌ ‘హ్యాట్రిక్‌’

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళ్తోంది. శనివారం ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌ (34 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేశాడు. భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి గెలిచింది. విలియమ్సన్‌ (44 బంతుల్లో 50; 4 ఫోర్లు, ఒక సిక్స్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కోల్‌కతా బ్యాటింగ్‌ సమయంలో 7 ఓవర్ల వద్ద వర్షం కురవడంతో ఆటకు అంతరాయం తప్పలేదు.

ఒకే ఒక్కడు… లిన్‌
మొదట బ్యాటింగ్‌ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మెన్‌ను హైదరాబాద్‌ పేసర్లు సమష్టిగా దెబ్బతీశారు. దీంతో ఆరంభం నుంచి ఇన్నింగ్స్‌ తడబడుతూనే సాగింది. ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ ఒక్కడే బాధ్యతగా ఆడాడు. రాబిన్‌ ఉతప్ప (3), నరైన్‌ (9), శుభ్‌మన్‌ గిల్‌ (3), శివమ్‌ మావి (7) ఇలా క్రీజ్‌లోకి ఎవరొచ్చినా… కుదురుగా ఆడేవారే కరువయ్యారు. లిన్‌తో కలిసి కాసేపు నితీశ్‌ రాణా (16 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (27 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కాస్త మెరుగ్గా ఆడారు. ఈ ముగ్గురు మినహా ఇంకెవరూ రెండంకెల స్కోర్లు చేయలేకపోయారు. పేసర్లు భువనేశ్వర్‌ (3/26), స్టాన్‌లేక్‌ (2/21)లతో పాటు ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ (2/21) తన స్పిన్‌తో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కట్టడి చేశాడు.

విలియమ్సన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌…
కష్టసాధ్యం కాని లక్ష్యమే అయినా… ధాటిగా ఆడిన సాహా (15 బంతుల్లో 24; 5 ఫోర్లు)తో పాటు కీలక ఓపెనర్‌ ధావన్‌ (7), కుదురుగా ఆడే మనీశ్‌ పాండే (4)లు తక్కువ స్కోరుకే నిష్క్రమించారు. దీంతో బ్యాటింగ్‌ భారం పూర్తిగా కెప్టెన్‌ విలియమ్సన్‌పైనే పడింది. 55 పరుగులకే టాపార్డర్‌ వికెట్లను కోల్పోయిన ఈ దశలో విలియమ్సన్, షకీబుల్‌ హసన్‌ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్‌) నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు. జట్టు స్కోరు 114 పరుగుల వద్ద షకీబ్, 5 పరుగుల వ్యవధిలో విలియమ్సన్‌ ఔటైనప్పటికీ మిగతా లాంఛనాన్ని యూసుఫ్‌ పఠాన్‌ (7 బంతుల్లో 17 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), దీపక్‌ హుడా (5 నాటౌట్‌) పూర్తి చేశారు.

ఇంట్లో బాలికలున్నారు.. మా ఓట్లు అడగొద్దు

జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో బాలికపై జరిగిన హత్యాచార ఘటనతో దేశవ్యాప్తంగా నిరసన సెగలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో బీజేపీపై పూర్తి వ్యతిరేకత మొదలైంది. ఎంతలా ఉంటే.. మా ఇంటికి ఓట్లు అడిగేందుకు రావొద్దు.. అసలే బాలికలు, అమ్మాయిలు ఉన్నారని నేరుగా ఇంటికే బోర్డులు తగిలించారు.

కేరళలోని ఛెగన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. సీపీఐ (ఎం) ఎమ్మెల్యే కేకే రాంచంద్రన్ నాయర్ మృతిచెందడంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కశ్మీర్, కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారికి కొన్ని మృగాలు డ్రగ్స్ ఇచ్చి కొన్నిరోజులపాటు అత్యాచారం చేయడంతో పాటు దారుణహత్య చేయడం కలకలం రేపుతోంది. పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ), బీజేపీ భాగస్వాములుగా జమ్మూకశ్మీర్‌లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాలు జరుగుతాయని కేరళ ప్రజలు భగ్గుమంటున్నారు.

‘మా ఇంట్లో బాలికలున్నారు. బీజేపీ నేతలు ఓట్లు అడిగేందుకు మాత్రం మా ఇంటికి రావొద్దు. మీకు ఓట్లడిగే అర్హతే లేదని’ ఛెగన్నూర్‌ స్థానికుల ఇళ్ల వద్ద, సీపీఐ (ఎం) కార్తకర్తల నివాసాలకు ఇలాంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో బీజేపీ నేతలు ఆత్మరక్షణధోరణిలో పడిపోయినట్లు కనిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్‌లు కసరత్తులు చేస్తున్నాయి. ఛెగన్నూర్ ఉప ఎన్నికే తమకు తొలి పరీక్షగా భావిస్తున్నాయి. అలప్పుఝాలోని ఛెగన్నూర్‌ను టెంపుల్ టౌన్‌గా ప్రసిద్ధి.