కోల్‌కతా తడాఖా

కోల్‌కతా: కోల్‌కతా అసాధారణ ప్రదర్శనతో చెలరేగింది. ఆల్‌రౌండ్‌ షోతో ఢిల్లీని అల్లకల్లోలం చేసింది. ఐపీఎల్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన పోరులో నైట్‌రైడర్స్‌ 71 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (35 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), రస్సెల్‌ (12 బంతుల్లో 41; 6 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 14.2 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. మ్యాక్స్‌వెల్‌ (22 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌ (26 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. కుల్దీప్‌ యాదవ్, నరైన్‌ చెరో 3 వికెట్లు తీశారు. నితీశ్‌ రాణాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

రాణా మెరుపులు…
టాస్‌ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్‌ ఎంచుకోగా, కోల్‌కతా ఇన్నింగ్స్‌ను లిన్, నరైన్‌ ప్రారంభించారు. తమ కెప్టెన్‌ నిర్ణయం సబబేనన్నట్లు బౌల్ట్‌ ఆరంభ ఓవర్లలో ప్రత్యర్థి ఓపెనర్లను కట్టడి చేశాడు. నరైన్‌ (1)ను బౌన్సర్‌తో దెబ్బతీశాడు. తర్వాత కథ కోల్‌కతావైపు మొగ్గింది. లిన్‌కు జతయిన ఉతప్ప ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. దీంతో 3 ఓవర్లకు 12/1గా ఉన్న స్కోరు మరో మూడు ఓవర్లలో 50/1కి చేరింది. నదీమ్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో ఉతప్ప 2 సిక్సర్లు, బౌండరీతో మొత్తం 18 పరుగులు చేశాడు. తర్వాత తేవటియా ఓవర్లో మరో సిక్సర్‌ బాదాడు. అయితే నదీమ్‌ తన మరుసటి ఓవర్లో గుడ్‌లెంగ్త్‌ డెలివరీతో ఉతప్పను బోల్తా కొట్టించాడు. నితీశ్‌ రాణా వచ్చిరాగానే సిక్స్‌లు, ఫోర్లతో పరుగుల వేగం పెంచాడు. లిన్‌ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్‌)ను షమీ ఔట్‌ చేయగా, కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (10 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఉన్న కాసేపు భారీషాట్లపైనే కన్నేశాడు. అతడిని మోరిస్‌ పెవిలియన్‌ చేర్చగా… ఈ దశలో వచ్చిన రస్సెల్‌ సిక్సర్ల మోత మోగించాడు. ఇతని అండతోనే రాణా (30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. వీరి మెరుపులతో స్కోరు వేగం ఒక్కసారిగా పుంజుకుంది. రస్సెల్‌ విధ్వంసం మరింత పెరుగుతున్న దశలో బౌల్ట్‌ చక్కని డెలివరీతో బౌల్డ్‌ చేశాడు. దీంతో ఊపిరిపీల్చుకున్న గంభీర్‌ సేన స్లాగ్‌ ఓవర్లలో మిగతా బ్యాట్స్‌మెన్‌ను సమర్థంగా కట్టడి చేయగలిగింది. 20వ ఓవర్‌ వేసిన తేవటియా కేవలం ఒక పరుగే ఇచ్చి శుభ్‌మన్‌ గిల్‌ (6), చావ్లా (0), కరన్‌ (2)లను ఔట్‌ చేశాడు.

ఫటాఫట్‌… ధనాధన్‌…
ఢిల్లీ ఇన్నింగ్స్‌ టపటపా… ధనాధన్‌… ఫటాఫట్‌ అన్నట్లు ముగిసింది. టాపార్డర్‌ వైఫల్యంతో ఆరంభం నుంచే కష్టాల్లో కూరుకుపోయింది. ఓవర్‌కు ఒకరు చొప్పున తొలి మూడు ఓవర్లలో వరుసగా జాసన్‌ రాయ్‌ (1), శ్రేయస్‌ అయ్యర్‌ (4), కెప్టెన్‌ గంభీర్‌ (8) ఔటయ్యారు. ఈ దశలో రిషభ్‌ పంత్, మ్యాక్స్‌వెల్‌ వికెట్‌ పడకుండా… రన్‌రేట్‌ తగ్గకుండా వేగంగా పరుగులు జతచేశారు. ఓవర్‌కు పది పరుగుల రన్‌రేట్‌తో ఢిల్లీ స్కోరు 8 ఓవర్లలో 80కి చేరింది. కానీ ఇదంతా ఐదు ఓవర్లకే పరిమితమైంది. కుల్దీప్‌ ఊరించే బంతులతో రిషభ్, మ్యాక్స్‌వెల్‌ల కథ ముగించడంతో కోల్‌కతా విజయం ఖాయమైంది

పవన్‌ ఒక్కరికే ఫ్యాన్స్‌ ఉన్నారా..

విలేకరుల సమావేశంలో అపూర్వ, శ్రీరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : సినీనటుడు పవన్‌ కల్యాణ్‌పై చేసిన ఆరోపణలకు మహిళా జూనియర్‌ ఆర్టిస్టులు క్షమాపణలు చెప్పారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’లపై మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌పై క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శృతి తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు వందల కోట్లతో అమరావతిలో ఇల్లు కడుతున్నారని, మసాజ్‌కు బెంగాళీ అమ్మాయిలు కావాలని, మహిళల సమస్యలను ఏమాత్రం పట్టించుకోరని పవన్‌పై ఘాటు విమర్శలు చేశారు.

సోమవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడుతూ.. పవన్‌ ఒక్కరికే అభిమానులు ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఫ్యాన్స్‌ను అదుపులో ఉంచుకోవాలంటూ సూచించారు. సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడటానికి తాము ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నామని, అభిమానుల పేరుతో కొందరు బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానుల పేరుతో ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌, కో ఆర్డినేటర్ల విధానాన్ని నిర్మూలించాలని, అప్పుడే మహిళా ఆర్టిస్టులకు తగిన న్యాయం జరుగుతుందన్నారు.

అగ్నిమాపక శాఖలో 325 పోస్టులకు 

అగ్నిమాపకశాఖలో

ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో వాటికి సంబంధించిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోస్టుల మంజూరుకు అనుమతినిస్తూ ఆర్థికశాఖ జీవో విడుదల చేసింది. అగ్నిమాపకశాఖలో స్టేషన్‌ ఆఫీసర్, ఫైర్‌మెన్, డ్రైవింగ్‌ ఆపరేటర్లు, టైపిస్టులు, జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టెనోలు మొత్తం కలిపి 325 పోస్టులు భర్తీ చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్‌ సోమవారం విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. ఆపరేషన్స్‌ విభాగం కింద ఉన్న పోస్టులను రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, పరిపాలనా వ్యవహారాల్లో ఉన్న పోస్టులను రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వాటితో కలిపే నోటిఫికేషనా?
రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా త్వరలో 22 వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే అదే నోటిఫికేషన్‌తోపాటు అగ్నిమాపకశాఖలోని ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తారా లేక ఆ నియామక ప్రక్రియ పూర్తయ్యాక విడిగా నోటిఫికేషన్‌ చేస్తారా అనే అంశంపై నియామక ఏజెన్సీలు స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం పోలీస్‌ నోటిఫికేషన్‌ వ్యవహారాల్లో రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిమగ్నమై ఉండగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పలు పరీక్షల నిర్వహణలో తలమునకలై ఉంది. అయితే టైపిస్టు, జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ స్టెనో పోస్టులు మొత్తం ఏడే ఉండటంతో త్వరలోనే ఆ నియామక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వర్గాల ద్వారా తెలిసింది