కోట్లాలో బౌలర్ల పంజా

స్కోరు ఎంత ఉన్నా ఈ సీజన్‌లో ప్రతీ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌ వరకు వెళ్లడం సంప్రదాయంగా మారినట్టుంది. ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో అభిమానులకు మరో థ్రిల్లర్‌ అనుభూతిని కలిగిస్తూ ఢిల్లీపై చివరి బంతికి నాలుగు పరుగుల తేడాతో పంజాబ్‌ ఉత్కంఠ విజయాన్నందుకుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. కరుణ్‌ నాయర్‌ (32 బంతుల్లో 4 ఫోర్లతో 34), మిల్లర్‌ (19 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 26)తో పాటు రాహుల్‌ (15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 23) ఓ మాదిరిగా ఆడారు. ప్లంకెట్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. అయ్యర్‌ (45 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 57) ఒక్కడే పోరాడాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అంకిత్‌ రాజ్‌పుత్‌కు దక్కింది.
శ్రేయాస్‌ ఒక్కడే..: ఛేదించాల్సింది స్వల్ప లక్ష్యమే అయినా ఢిల్లీ పూర్తిగా తడబడింది. ఓపెనర్‌ పృథ్వీషా తన అరంగేట్ర మ్యాచ్‌లో మెరిశాడు. క్రీజులో కొద్దిసేపే గడిపినా బౌండరీలతో చెలరేగాడు. 10 బంతుల్లో నాలుగు ఫోర్లతో 22 పరుగులు చేసి మూడో ఓవర్‌లో అవుటయ్యాడు. వేగంగా ఆడి రన్‌రేట్‌ మెరుగుపరుచుకోవాలనే ఆశతో వన్‌డౌన్‌లో మాక్స్‌వెల్‌ (12)ను దించినా ఫలితం లేకపోయింది. గంభీర్‌ (4), పంత్‌ (4) కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగారు. ఓ దశలో 76 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోగా శ్రేయాస్‌ అయ్యర్‌, తెవాటియా ఢిల్లీని కాసేపు ఆదుకున్నారు. 17వ ఓవర్‌లో తెవాటియా 6,4తో రాణించినా మరుసటి ఓవర్‌లో అవుటయ్యాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు రావాల్సి ఉండగా శ్రేయాస్‌ 6,4 కొట్టినా చివరి బంతికి అవుటయ్యాడు.
తేలిపోయారు..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కూడా బ్యాటింగ్‌లో ఇబ్బందిపడింది. గేల్‌ విశ్రాంతి కారణంగా దూరం కాగా పవర్‌ప్లేలో ఇప్పటిదాకా ఓవర్‌కు పది పరుగుల చొప్పున రాణించిన ఈ జట్టు ఈసారి రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ప్లంకెట్‌, క్రిస్టియాన్‌ ఆద్యంతం అద్భుతంగా కట్టడి చేశారు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ ఫించ్‌ను 148.7 కి.మీ వేగంతో బంతిని విసిరిన అవేశ్‌ క్యాచ్‌ ద్వారా అవుట్‌ చేశాడు. అయితే మూడో ఓవర్‌లో మయాంక్‌ (16 బంతుల్లో 21) రెండు ఫోర్లు, రాహుల్‌ ఓ ఫోర్‌ బాదారు. ఆ తర్వాత కూడా రాహుల్‌ ఓ సిక్స్‌, ఫోర్‌తో జోరు చూపినా ఐదో ఓవర్‌లోనే ప్లంకెట్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కెరీర్‌లో తొలి ఐపీఎల్‌ ఆడుతున్న ప్లంకెట్‌ 8వ ఓవర్‌లో వేసిన ఓ గుడ్‌ లెంగ్త్‌ డెలివరీకి మయాంక్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఈదశలో కరుణ్‌, యువరాజ్‌ (14) జాగ్రత్తగా ఆడడంతో పంజాబ్‌ స్కోరు నత్తనడకన సాగింది. ఐదు ఓవర్లపాటు ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. దీనికి తోడు యువరాజ్‌ను అవేశ్‌ ఖాన్‌ అవుట్‌ చేయడంతో జట్టు 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అటు వరుస ఓవర్లలో మిల్లర్‌ ఇచ్చిన క్యాచ్‌లను మాక్స్‌వెల్‌, పృథ్వీ షా వదిలేశారు. 15 ఓవర్లు ముగిసేసరికి 100 పరుగులు చేసిన పంజాబ్‌ డెత్‌ ఓవర్లలోనూ వేగం కనబరచలేకపోయింది. కరుణ్‌, మిల్లర్‌ వరుస ఓవర్లలో అవుట్‌ కావడంతో పాటు ఆఖరి ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి నాలుగు పరుగులు చేసింది.
స్కోరు బోర్డు
పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) అవేశ్‌ (బి) ప్లంకెట్‌ 23; ఫించ్‌ (సి) అయ్యర్‌ (బి) అవేశ్‌ 2; మయాంక్‌ (బి) ప్లంకెట్‌ 21; కరుణ్‌ (సి) అయ్యర్‌ (బి) ప్లంకెట్‌ 34; యువరాజ్‌ (సి) రిషభ్‌ (బి) అవేశ్‌ 14; మిల్లర్‌ (సి) ప్లంకెట్‌ (బి) క్రిస్టియాన్‌ 26; అశ్విన్‌ (సి) తెవాటియా (బి) బౌల్ట్‌ 6; టై (బి) బౌల్ట్‌ 3; శరణ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 8 వికెట్లకు 143. వికెట్ల పతనం: 1-6, 2-42, 3-60, 4-85, 5-116, 6-127, 7-140, 8-143. బౌలింగ్‌: బౌల్ట్‌ 3-0-21-2; అవేశ్‌ 4-0-36-2; ప్లంకెట్‌ 4-0-17-3; క్రిస్టియాన్‌ 3-0-17-1; మిశ్రా 4-0-33-0; మాక్స్‌వెల్‌ 1-0-4-0; తెవాటియా 1-0-6-0.
ఢిల్లీ ఇన్నింగ్స్‌: పృథ్వీ (బి) రాజ్‌పుత్‌ 22; గంభీర్‌ (సి) ఫించ్‌ (బి) టై 4; మాక్స్‌వెల్‌ (సి) టై (బి) రాజ్‌పుత్‌ 12; శ్రేయాస్‌ (సి) ఫించ్‌ (బి) ముజీబ్‌ 57; రిషభ్‌ (బి) ముజీబ్‌ 4; క్రిస్టియాన్‌ రనౌట్‌ 6; తెవాటియా (సి) రాహుల్‌ (బి) టై 24; ప్లంకెట్‌ (సి) నాయర్‌ (బి) శరణ్‌ 0; అమిత్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 8 వికెట్లకు 139. వికెట్ల పతనం: 1-25, 2-41, 3-42, 4-61, 5-76, 6-123, 7-124; 8-139. బౌలింగ్‌: రాజ్‌పుత్‌ 4-0-23-2; శరణ్‌ 4-0-45-1; టై 4-0-25-2; అశ్విన్‌ 4-0-19-0; ముజీబ్‌ 4-0-25-2.

మండుతున్న ఎండలు…వడదెబ్బతో 15 మంది మృతి

ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరుకోవడంతో ఉపాధిహామి పథకం కింద పనిచేస్తున్న కూలీలు వడదెబ్బ బారిన పడుతున్నారు. గడచిన నాలుగురోజుల్లో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 15 మంది వడదెబ్బతో మరణించారు. పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన కనక బుజ్జి, సిర్పూర్ యూ మండలానికి చెందిన బోడసు రాజన్న, ఖానాపూర్ మండలానికి చెందిన మరో కూలీ వడదెబ్బతో మరణించారు. మందమర్రికి చెందిన లక్ష్మీ, టేకులపల్లికి చెందిన రాజు, బాటవాన్ పల్లి గ్రామానికి చెందిన రోజా, బెల్లంపల్లికి చెందిన నరేష్ లు వడదెబ్బతో మరణించారు. వడదెబ్బ మరణాలు సంభవించడంతో అప్రమత్తమైన అధికారులు వైద్యఆరోగ్యకేంద్రాల్లో మందులను సిద్ధం చేశారు. ఎండలో బయటకు వెళ్లవద్దని, అధికంగా మంచినీరు తాగాలని వైద్యులు సూచించారు.

మహేష్‌తో మూవీకి సుక్కు రెమ్యునరేషన్ ఎంతంటే..

ఒకరు రంగస్థలం బ్లాక్ బస్టర్ అయిన జోష్‌లో ఉన్నారు. మరొకరు భరత్ అనే నేను సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతున్న జోష్‌లో ఉన్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవబోతున్నాయి. రంగస్థలం సినిమా డైరెక్టర్, ‘భరత్ అనే నేను’ హీరో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.
సుకుమార్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో త్వరలో ఓ సినిమా పట్టాలెక్కనుంది. ఈ న్యూస్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌. ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ న్యూస్ ట్రోల్ అవుతోంది. సుక్కు ఈ సినిమాకు రూ.15 కోట్లు తీసుకోబోతున్నారని సమాచారం.