206.. కొట్టేశారు

వయసైపోయిందని.. వాడి తగ్గిందని విమర్శించిన వాళ్లకు పంజాబ్‌పై వీరోచిత ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్పాడు ధోనీ. కానీ, అప్పుడు అద్భుతంగా పోరాడినా ఆఖరి ఓవర్లో తడబడి జట్టును గెలిపించలేకపోయాడు. ఇప్పుడు ఆ లోటునూ తీర్చేశాడు. తనలోని విధ్వంసకర వీరుడిని నిద్ర లేపిన మహీ చిన్నస్వామి స్టేడియంలో చెలరేగిపోయాడు. 206 పరుగుల భారీ ఛేదనలో 74/4తో జట్టు ఓటమి దిశగా పయనిస్తున్న దశలో క్రీజులోకి వచ్చిన అతను.. ఆకాశమే హద్దుగా విజృంభించాడు. ధోనీ అంటే ఇదీ.. అనేట్టుగా కసితీరా బంతిని బాదేశాడు. అతనితో పాటు తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కూడా సింహగర్జన చేశాడు. వీరిద్దరి అసమాన బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాన్ని ఛేదించిన చెన్నై హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంబటి రాయుడు (53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 82), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ధోనీ (34 బంతుల్లో ఫోర్‌, 7 సిక్సర్లతో 70 నాటౌట్‌) అసమాన ఆటతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్లతో బెంగళూరుపై ఉత్కంఠ విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండగా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత డివిల్లీర్స్‌ (30 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 68), క్వింటన్‌ డికాక్‌ (37 బంతుల్లో ఫోర్‌, 4 సిక్సర్లతో 53) మెరుపులతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. కానీ, దాన్ని కాపాడుకోలేకపోయింది.

రాయుడు, ధోనీ ధమాకా: భారీ ఛేదనలో చెన్నై ఆరో బంతికే వాట్సన్‌ (7) వికెట్‌ కోల్పోయింది. కానీ, రాయుడు, రైనా చెలరేగి ఆడడంతో ఐదు ఓవర్లలోనే యాభై పరుగులు చేసింది. అయితే, ఆరో ఓవర్లో రైనాను అవుట్‌ చేసిన ఉమేష్‌ ఈ జోడీని విడదీశాడు. ఆపై, చాహల్‌ వరుస ఓవర్లలో బిల్లింగ్స్‌ (9), జడేజా (3)ను పెవిలియన్‌ చేర్చడంతో పర్యాటక జట్టు 74/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో రాయుడికి ధోనీ జతకలిశాడు. అంబటి కాస్త నెమ్మదించగా.. ధోనీ మాత్రం పవర్‌ఫుల్‌ షాట్లతో రెచ్చిపోయాడు. నేగి, ఆండర్సన్‌ ఓవర్లలో రెండు భారీ సిక్సర్లు రాబట్టి చెన్నై శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఇక, నేగి వేసిన 14వ ఓవర్లో మహీ రెండు, రాయుడు ఒక సిక్సర్‌ బాది ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చారు. అయితే, కోరె బౌలింగ్‌లో అతనిచ్చిన క్యాచ్‌ను ఉమేష్‌ వదిలేయడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న అంబటి.. ఆ ఓవర్లో రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. చివరి 24 బంతుల్లో చెన్నైకి 55 పరుగులు అవసరం అయ్యాయి. 17వ ఓవర్లో రాయుడు రనౌటైనా.. ధోనీ ధాటిని కొనసాగించాడు. దాంతో, సమీకరణం 12 బంతుల్లో 30గా మారగా… ఉత్కంఠ రెట్టింపైంది. 19వ ఓవర్లో మూడు వైడ్లు వేసిన సిరాజ్‌ సిక్సర్‌ సహా 14 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆఖరి ఓవర్లో చెన్నైకి 16 పరుగులు అవసరం అవగా.. ఆండర్సన్‌ వేసిన తొలి రెండు బంతులను 4, 6 సిక్సర్‌గా మలిచిన డ్వేన్‌ బ్రావో (14 నాటౌట్‌) మూడో బాల్‌కు సింగిల్‌ తీశాడు. ధోనీ సిక్సర్‌తో తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు.

డివిల్లీర్స్‌, డికాక్‌ జోరు
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు మంచి ఆరంభాన్ని దక్కించుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (18) క్వింటన్‌ డికాక్‌ ధాటిగా ఆడడంతో 4 ఓవర్లలో 35 పరుగులు చేసింది. అయితే, క్రీజులో కుదురుకున్న కోహ్లీని అవుట్‌ చేసిన శార్దూల్‌ చెన్నైకి బ్రేక్‌ ఇచ్చాడు. కానీ, వన్‌డౌన్‌లో వచ్చిన డివిల్లీర్స్‌ ఊచకోత మొదలు పెట్టడంతో ప్రత్యర్థి బౌలర్లు బిత్తరపోయారు. హర్భజన్‌ వేసిన ఆరో ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో విధ్వంసానికి నాంది పలికాడు. తాహిర్‌ వేసిన 11వ ఓవర్లో 4, 6, 6తో రెచ్చిపోయాడు. ఇందులో తొలి సిక్సర్‌ స్టేడియం బయట పడడం విశేషం. ఆపై, శార్దూల్‌ బౌలింగ్‌లో ఏబీ హ్యాట్రిక్‌ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరో ఎండ్‌లో డికాక్‌ కూడా ముచ్చటైన షాట్లతో అలరించడంతో 13 ఓవర్లకే బెంగళూరు 138 రన్స్‌ చేసింది. ఈ దశలో డికాక్‌ను బ్రావో, ఏబీ, కోరె అండర్సన్‌ (2)ను వరుస బంతుల్లో అవుట్‌ చేసి బెంగళూరు జోరుకు బ్రేకులు వేశారు. అయితే, మన్‌దీ్‌ప సింగ్‌ (17 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లతో 32)తో పాటు సుందర్‌ (13 నాటౌట్‌) మెరుపులతో జట్టు స్కోరు 200 దాటింది.

బెంగళూరు: డికాక్‌ (సి అండ్‌ బి) బ్రావో 53, కోహ్లీ (సి) జడేజా (బి) శార్దూల్‌ 18, డివిల్లీర్స్‌ (సి) బిల్లింగ్‌ (బి) తాహిర్‌ 68, ఆండర్సన్‌ (సి) హర్భజన్‌ (బి) తాహిర్‌ 2, మన్‌దీ్‌ప (సి) జడేజా (బి) శార్దూల్‌ 32, గ్రాండ్‌హోమ్‌ (రనౌట్‌) 11, నేగి (రనౌట్‌) 0, సుందర్‌ (నాటౌట్‌) 13, ఉమేష్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) బ్రావో 0, సిరాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 205/8; వికెట్ల పతనం: 1-35, 2-138, 3-142, 4-142, 5-191, 6-191, 7-192, 8-193;

బౌలింగ్‌: దీపక్‌ 2-0-20-0, శార్దూల్‌ 4-1-46-2, హర్భజన్‌ 2-0-24-0, జడేజా 2-0-22-0, వాట్సన్‌ 2-0-21-0, తాహిర్‌ 4-0-35-2, బ్రావో 4-1-33-2.

One thought on “206.. కొట్టేశారు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s