‘మహానాయకుడి ‘యాత్ర’ను సెలబ్రేట్‌ చేసుకుందాం’

mahi V raghv 2

దివం‍గత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు మహి వీ రాఘవ్‌ దర్శకుడు. 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డిలు నిర్మిస్తున్నారు. మాలీవుడ్ మెగాస్టార్‌ మమ్ముట్టి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సందర్భంగా దర్శకుడు మహి వీ రాఘవ్‌ తన టీంతో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాన్ని తెరకెక్కించే అవకాశం నాకు రావటం వరంగా భావిస్తున్నాను. ఈ విషయంలో నాకు సహకరించిన వైఎస్‌ఆర్‌ కుటుంబ సభ్యులకు, కోట్లాది కూడా ఉన్న ఆయన అభిమానులకు నా కృతజ్ఞతలు. ఈ సినిమాను మరే సినిమాలో పోల్చటం గానీ, పోటిగా చూపించటం కానీ చేయకండి. ఆ మహానాయకుడి యాత్రను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుందాం.

ఎన్టీఆర్ గారూ, వైఎస్‌ఆర్‌గారూ ఈ మట్టి వారసులు, ఎంతో కీర్తిని, గౌరవాన్ని మనకు వదిలి వెళ్లిన తెలుగు లెజెండ్స్‌‌. మన అభిప్రాయ భేదాలతో వారి గౌరవానికి భంగం కలిగించకూడదు. వైఎస్‌ఆర్‌, చిరంజీవి గారిపట్ల నా ప్రేమ కారణంగా నాకు ఎవరి మీద ద్వేషం కలగలేదు. మా యాత్ర సినిమాను ప్రేక్షకులు ఎలా స్వాగతిస్తారో తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్న’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.by: mananews

టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య

jhansi-suicide_4

ప్రముఖ టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని శ్రీనగర్‌ కాలనీలో తన నివాసంలోనే ఝాన్సీ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా టీవీ ఛానెల్‌లో ప్రసారమయ్యే ‘పవిత్రబంధం’ అనే సీరియల్‌లో ఝాన్సీ నటిస్తున్నారు. ఝాన్సీ స్వస్థలం కృష్ణ జిల్లా, ముదనేపల్లి మండలం వడాలి గ్రామం.

ప్రియుడు మోసం చేయడంతోనే..
ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సూర్య అనే వ్యక్తిని ఆరునెలలుగా ఝాన్సీని ప్రేమిస్తున్నాడని, అతనితో పరిచయమయ్యాకే సీరియల్స్‌ మానేసి ఝాన్సీ నటనకు దూరమైందన్నారు. గత కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోవాలని ఝాన్సీ బలవంతపెట్టడంతో సూర్య ఆమెను దూరం పెట్టాడని, సీరియల్‌ అవకాశాలు కోల్పోయి.. మరోవైపు సూర్య మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. ఇక ఝాన్సీ సూర్యతో సహజీవనం కూడా చేసినట్లు తెలుస్తోంది. by:mana news

జయరామ్‌ హత్యకేసులో కీలక మలుపు..!

shikha-jayaram

కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జయరామ్‌  హత్య కేసులో మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై మృతుని భార్య పద్మశ్రీ అనుమానం వ్యక్త చేశారు. కేసును తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేయాలని కోరుతూ జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించారు. గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె ఫిర్యాదు చేశారు.(ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదు)

కేసు వ్యవహారాలన్నీ తెలంగాణతో ముడిపడి ఉండడంతోనే జయరామ్‌ కేసును బదిలీ చేసినట్టు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. పద్మశ్రీ ఆరోపణల నేపథ్యంలో కేసును బదిలీ చేయకుండా మరింత వివాదాలకు తావు ఇవ్వకూడదని ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జయరామ్‌ హత్య కేసులో శిఖాకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసులు చెప్పడంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మేనకోడలు శిఖా, సొంత అక్కనుంచి ప్రాణహాని ఉందంటూ జయరామ్‌ గతంలో తనతో చెప్పినట్టు పద్మశ్రీ మీడియాకు వెల్లడించారు by:mana news

దసరా టార్గెట్‌గా ఎన్టీఆర్

‘జై లవకుశ’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఆ లోటును భర్తీ చేస్తున్నాడు. జెట్ స్పీడుతో దూసుకెళుతోన్న తారక్ దసరాకు రావడం ఖాయమంటున్నాడట.

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం రీసెంట్‌గా సెట్స్ పైకి వెళ్లింది. షూటింగ్ ప్రారంభమవడానికి కాస్త టైమ్ తీసుకున్నప్పటికీ.. వన్స్ సెట్స్‌పైకి వచ్చాక మాత్రం జెట్ స్పీడుతో దూసుకెళుతోంది. హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జంటగా పూజాహెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. దసరా టార్గెట్‌గా మండు వేసవిని లెక్కచేయకుండా ఈ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డాడు ఎన్టీఆర్.

ఓ వైపు హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంటే మరోవైపు ముంబైలో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిద్ధమవుతోంది. మొదట్లో ఈ సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడు కాగా.. తర్వాత ఆ స్థానంలోకి తమన్ వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌తో వర్క్ చేయడం కొత్తేమి కాదు కానీ.. త్రివిక్రమ్‌తో మాత్రం తమన్‌కు ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ సినిమా కోసం ముంబైలో సాంగ్స్ రికార్డింగ్ వర్క్‌లో బిజీగా ఉన్నాడట తమన్. అసలే ఈమధ్య రూటు మార్చి మెలోడీ సాంగ్స్‌తో ఆకట్టుకుంటోన్న తమన్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడో చూడాలి..!

206.. కొట్టేశారు

వయసైపోయిందని.. వాడి తగ్గిందని విమర్శించిన వాళ్లకు పంజాబ్‌పై వీరోచిత ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్పాడు ధోనీ. కానీ, అప్పుడు అద్భుతంగా పోరాడినా ఆఖరి ఓవర్లో తడబడి జట్టును గెలిపించలేకపోయాడు. ఇప్పుడు ఆ లోటునూ తీర్చేశాడు. తనలోని విధ్వంసకర వీరుడిని నిద్ర లేపిన మహీ చిన్నస్వామి స్టేడియంలో చెలరేగిపోయాడు. 206 పరుగుల భారీ ఛేదనలో 74/4తో జట్టు ఓటమి దిశగా పయనిస్తున్న దశలో క్రీజులోకి వచ్చిన అతను.. ఆకాశమే హద్దుగా విజృంభించాడు. ధోనీ అంటే ఇదీ.. అనేట్టుగా కసితీరా బంతిని బాదేశాడు. అతనితో పాటు తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కూడా సింహగర్జన చేశాడు. వీరిద్దరి అసమాన బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాన్ని ఛేదించిన చెన్నై హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంబటి రాయుడు (53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 82), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ధోనీ (34 బంతుల్లో ఫోర్‌, 7 సిక్సర్లతో 70 నాటౌట్‌) అసమాన ఆటతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్లతో బెంగళూరుపై ఉత్కంఠ విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండగా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత డివిల్లీర్స్‌ (30 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 68), క్వింటన్‌ డికాక్‌ (37 బంతుల్లో ఫోర్‌, 4 సిక్సర్లతో 53) మెరుపులతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. కానీ, దాన్ని కాపాడుకోలేకపోయింది.

రాయుడు, ధోనీ ధమాకా: భారీ ఛేదనలో చెన్నై ఆరో బంతికే వాట్సన్‌ (7) వికెట్‌ కోల్పోయింది. కానీ, రాయుడు, రైనా చెలరేగి ఆడడంతో ఐదు ఓవర్లలోనే యాభై పరుగులు చేసింది. అయితే, ఆరో ఓవర్లో రైనాను అవుట్‌ చేసిన ఉమేష్‌ ఈ జోడీని విడదీశాడు. ఆపై, చాహల్‌ వరుస ఓవర్లలో బిల్లింగ్స్‌ (9), జడేజా (3)ను పెవిలియన్‌ చేర్చడంతో పర్యాటక జట్టు 74/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో రాయుడికి ధోనీ జతకలిశాడు. అంబటి కాస్త నెమ్మదించగా.. ధోనీ మాత్రం పవర్‌ఫుల్‌ షాట్లతో రెచ్చిపోయాడు. నేగి, ఆండర్సన్‌ ఓవర్లలో రెండు భారీ సిక్సర్లు రాబట్టి చెన్నై శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఇక, నేగి వేసిన 14వ ఓవర్లో మహీ రెండు, రాయుడు ఒక సిక్సర్‌ బాది ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చారు. అయితే, కోరె బౌలింగ్‌లో అతనిచ్చిన క్యాచ్‌ను ఉమేష్‌ వదిలేయడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న అంబటి.. ఆ ఓవర్లో రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. చివరి 24 బంతుల్లో చెన్నైకి 55 పరుగులు అవసరం అయ్యాయి. 17వ ఓవర్లో రాయుడు రనౌటైనా.. ధోనీ ధాటిని కొనసాగించాడు. దాంతో, సమీకరణం 12 బంతుల్లో 30గా మారగా… ఉత్కంఠ రెట్టింపైంది. 19వ ఓవర్లో మూడు వైడ్లు వేసిన సిరాజ్‌ సిక్సర్‌ సహా 14 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆఖరి ఓవర్లో చెన్నైకి 16 పరుగులు అవసరం అవగా.. ఆండర్సన్‌ వేసిన తొలి రెండు బంతులను 4, 6 సిక్సర్‌గా మలిచిన డ్వేన్‌ బ్రావో (14 నాటౌట్‌) మూడో బాల్‌కు సింగిల్‌ తీశాడు. ధోనీ సిక్సర్‌తో తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు.

డివిల్లీర్స్‌, డికాక్‌ జోరు
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు మంచి ఆరంభాన్ని దక్కించుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (18) క్వింటన్‌ డికాక్‌ ధాటిగా ఆడడంతో 4 ఓవర్లలో 35 పరుగులు చేసింది. అయితే, క్రీజులో కుదురుకున్న కోహ్లీని అవుట్‌ చేసిన శార్దూల్‌ చెన్నైకి బ్రేక్‌ ఇచ్చాడు. కానీ, వన్‌డౌన్‌లో వచ్చిన డివిల్లీర్స్‌ ఊచకోత మొదలు పెట్టడంతో ప్రత్యర్థి బౌలర్లు బిత్తరపోయారు. హర్భజన్‌ వేసిన ఆరో ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో విధ్వంసానికి నాంది పలికాడు. తాహిర్‌ వేసిన 11వ ఓవర్లో 4, 6, 6తో రెచ్చిపోయాడు. ఇందులో తొలి సిక్సర్‌ స్టేడియం బయట పడడం విశేషం. ఆపై, శార్దూల్‌ బౌలింగ్‌లో ఏబీ హ్యాట్రిక్‌ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరో ఎండ్‌లో డికాక్‌ కూడా ముచ్చటైన షాట్లతో అలరించడంతో 13 ఓవర్లకే బెంగళూరు 138 రన్స్‌ చేసింది. ఈ దశలో డికాక్‌ను బ్రావో, ఏబీ, కోరె అండర్సన్‌ (2)ను వరుస బంతుల్లో అవుట్‌ చేసి బెంగళూరు జోరుకు బ్రేకులు వేశారు. అయితే, మన్‌దీ్‌ప సింగ్‌ (17 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లతో 32)తో పాటు సుందర్‌ (13 నాటౌట్‌) మెరుపులతో జట్టు స్కోరు 200 దాటింది.

బెంగళూరు: డికాక్‌ (సి అండ్‌ బి) బ్రావో 53, కోహ్లీ (సి) జడేజా (బి) శార్దూల్‌ 18, డివిల్లీర్స్‌ (సి) బిల్లింగ్‌ (బి) తాహిర్‌ 68, ఆండర్సన్‌ (సి) హర్భజన్‌ (బి) తాహిర్‌ 2, మన్‌దీ్‌ప (సి) జడేజా (బి) శార్దూల్‌ 32, గ్రాండ్‌హోమ్‌ (రనౌట్‌) 11, నేగి (రనౌట్‌) 0, సుందర్‌ (నాటౌట్‌) 13, ఉమేష్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) బ్రావో 0, సిరాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 205/8; వికెట్ల పతనం: 1-35, 2-138, 3-142, 4-142, 5-191, 6-191, 7-192, 8-193;

బౌలింగ్‌: దీపక్‌ 2-0-20-0, శార్దూల్‌ 4-1-46-2, హర్భజన్‌ 2-0-24-0, జడేజా 2-0-22-0, వాట్సన్‌ 2-0-21-0, తాహిర్‌ 4-0-35-2, బ్రావో 4-1-33-2.