దసరా టార్గెట్‌గా ఎన్టీఆర్

‘జై లవకుశ’ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ ఆ లోటును భర్తీ చేస్తున్నాడు. జెట్ స్పీడుతో దూసుకెళుతోన్న తారక్ దసరాకు రావడం ఖాయమంటున్నాడట.

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం రీసెంట్‌గా సెట్స్ పైకి వెళ్లింది. షూటింగ్ ప్రారంభమవడానికి కాస్త టైమ్ తీసుకున్నప్పటికీ.. వన్స్ సెట్స్‌పైకి వచ్చాక మాత్రం జెట్ స్పీడుతో దూసుకెళుతోంది. హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జంటగా పూజాహెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. దసరా టార్గెట్‌గా మండు వేసవిని లెక్కచేయకుండా ఈ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డాడు ఎన్టీఆర్.

ఓ వైపు హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంటే మరోవైపు ముంబైలో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిద్ధమవుతోంది. మొదట్లో ఈ సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడు కాగా.. తర్వాత ఆ స్థానంలోకి తమన్ వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌తో వర్క్ చేయడం కొత్తేమి కాదు కానీ.. త్రివిక్రమ్‌తో మాత్రం తమన్‌కు ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ సినిమా కోసం ముంబైలో సాంగ్స్ రికార్డింగ్ వర్క్‌లో బిజీగా ఉన్నాడట తమన్. అసలే ఈమధ్య రూటు మార్చి మెలోడీ సాంగ్స్‌తో ఆకట్టుకుంటోన్న తమన్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి ట్యూన్స్ ఇస్తాడో చూడాలి..!

206.. కొట్టేశారు

వయసైపోయిందని.. వాడి తగ్గిందని విమర్శించిన వాళ్లకు పంజాబ్‌పై వీరోచిత ఇన్నింగ్స్‌తో సమాధానం చెప్పాడు ధోనీ. కానీ, అప్పుడు అద్భుతంగా పోరాడినా ఆఖరి ఓవర్లో తడబడి జట్టును గెలిపించలేకపోయాడు. ఇప్పుడు ఆ లోటునూ తీర్చేశాడు. తనలోని విధ్వంసకర వీరుడిని నిద్ర లేపిన మహీ చిన్నస్వామి స్టేడియంలో చెలరేగిపోయాడు. 206 పరుగుల భారీ ఛేదనలో 74/4తో జట్టు ఓటమి దిశగా పయనిస్తున్న దశలో క్రీజులోకి వచ్చిన అతను.. ఆకాశమే హద్దుగా విజృంభించాడు. ధోనీ అంటే ఇదీ.. అనేట్టుగా కసితీరా బంతిని బాదేశాడు. అతనితో పాటు తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కూడా సింహగర్జన చేశాడు. వీరిద్దరి అసమాన బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాన్ని ఛేదించిన చెన్నై హ్యాట్రిక్‌ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంబటి రాయుడు (53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 82), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ధోనీ (34 బంతుల్లో ఫోర్‌, 7 సిక్సర్లతో 70 నాటౌట్‌) అసమాన ఆటతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఐదు వికెట్లతో బెంగళూరుపై ఉత్కంఠ విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండగా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత డివిల్లీర్స్‌ (30 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 68), క్వింటన్‌ డికాక్‌ (37 బంతుల్లో ఫోర్‌, 4 సిక్సర్లతో 53) మెరుపులతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. కానీ, దాన్ని కాపాడుకోలేకపోయింది.

రాయుడు, ధోనీ ధమాకా: భారీ ఛేదనలో చెన్నై ఆరో బంతికే వాట్సన్‌ (7) వికెట్‌ కోల్పోయింది. కానీ, రాయుడు, రైనా చెలరేగి ఆడడంతో ఐదు ఓవర్లలోనే యాభై పరుగులు చేసింది. అయితే, ఆరో ఓవర్లో రైనాను అవుట్‌ చేసిన ఉమేష్‌ ఈ జోడీని విడదీశాడు. ఆపై, చాహల్‌ వరుస ఓవర్లలో బిల్లింగ్స్‌ (9), జడేజా (3)ను పెవిలియన్‌ చేర్చడంతో పర్యాటక జట్టు 74/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో రాయుడికి ధోనీ జతకలిశాడు. అంబటి కాస్త నెమ్మదించగా.. ధోనీ మాత్రం పవర్‌ఫుల్‌ షాట్లతో రెచ్చిపోయాడు. నేగి, ఆండర్సన్‌ ఓవర్లలో రెండు భారీ సిక్సర్లు రాబట్టి చెన్నై శిబిరంలో ఉత్సాహం నింపాడు. ఇక, నేగి వేసిన 14వ ఓవర్లో మహీ రెండు, రాయుడు ఒక సిక్సర్‌ బాది ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చారు. అయితే, కోరె బౌలింగ్‌లో అతనిచ్చిన క్యాచ్‌ను ఉమేష్‌ వదిలేయడం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న అంబటి.. ఆ ఓవర్లో రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. చివరి 24 బంతుల్లో చెన్నైకి 55 పరుగులు అవసరం అయ్యాయి. 17వ ఓవర్లో రాయుడు రనౌటైనా.. ధోనీ ధాటిని కొనసాగించాడు. దాంతో, సమీకరణం 12 బంతుల్లో 30గా మారగా… ఉత్కంఠ రెట్టింపైంది. 19వ ఓవర్లో మూడు వైడ్లు వేసిన సిరాజ్‌ సిక్సర్‌ సహా 14 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆఖరి ఓవర్లో చెన్నైకి 16 పరుగులు అవసరం అవగా.. ఆండర్సన్‌ వేసిన తొలి రెండు బంతులను 4, 6 సిక్సర్‌గా మలిచిన డ్వేన్‌ బ్రావో (14 నాటౌట్‌) మూడో బాల్‌కు సింగిల్‌ తీశాడు. ధోనీ సిక్సర్‌తో తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు.

డివిల్లీర్స్‌, డికాక్‌ జోరు
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు మంచి ఆరంభాన్ని దక్కించుకుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (18) క్వింటన్‌ డికాక్‌ ధాటిగా ఆడడంతో 4 ఓవర్లలో 35 పరుగులు చేసింది. అయితే, క్రీజులో కుదురుకున్న కోహ్లీని అవుట్‌ చేసిన శార్దూల్‌ చెన్నైకి బ్రేక్‌ ఇచ్చాడు. కానీ, వన్‌డౌన్‌లో వచ్చిన డివిల్లీర్స్‌ ఊచకోత మొదలు పెట్టడంతో ప్రత్యర్థి బౌలర్లు బిత్తరపోయారు. హర్భజన్‌ వేసిన ఆరో ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో విధ్వంసానికి నాంది పలికాడు. తాహిర్‌ వేసిన 11వ ఓవర్లో 4, 6, 6తో రెచ్చిపోయాడు. ఇందులో తొలి సిక్సర్‌ స్టేడియం బయట పడడం విశేషం. ఆపై, శార్దూల్‌ బౌలింగ్‌లో ఏబీ హ్యాట్రిక్‌ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. మరో ఎండ్‌లో డికాక్‌ కూడా ముచ్చటైన షాట్లతో అలరించడంతో 13 ఓవర్లకే బెంగళూరు 138 రన్స్‌ చేసింది. ఈ దశలో డికాక్‌ను బ్రావో, ఏబీ, కోరె అండర్సన్‌ (2)ను వరుస బంతుల్లో అవుట్‌ చేసి బెంగళూరు జోరుకు బ్రేకులు వేశారు. అయితే, మన్‌దీ్‌ప సింగ్‌ (17 బంతుల్లో ఫోర్‌, 3 సిక్సర్లతో 32)తో పాటు సుందర్‌ (13 నాటౌట్‌) మెరుపులతో జట్టు స్కోరు 200 దాటింది.

బెంగళూరు: డికాక్‌ (సి అండ్‌ బి) బ్రావో 53, కోహ్లీ (సి) జడేజా (బి) శార్దూల్‌ 18, డివిల్లీర్స్‌ (సి) బిల్లింగ్‌ (బి) తాహిర్‌ 68, ఆండర్సన్‌ (సి) హర్భజన్‌ (బి) తాహిర్‌ 2, మన్‌దీ్‌ప (సి) జడేజా (బి) శార్దూల్‌ 32, గ్రాండ్‌హోమ్‌ (రనౌట్‌) 11, నేగి (రనౌట్‌) 0, సుందర్‌ (నాటౌట్‌) 13, ఉమేష్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) బ్రావో 0, సిరాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 205/8; వికెట్ల పతనం: 1-35, 2-138, 3-142, 4-142, 5-191, 6-191, 7-192, 8-193;

బౌలింగ్‌: దీపక్‌ 2-0-20-0, శార్దూల్‌ 4-1-46-2, హర్భజన్‌ 2-0-24-0, జడేజా 2-0-22-0, వాట్సన్‌ 2-0-21-0, తాహిర్‌ 4-0-35-2, బ్రావో 4-1-33-2.

సర్కారీ కొలువుకు దూరం

సర్కారీ కొలువుకు నోటిఫికేషన్‌ వచ్చిందంటే దరఖాస్తులు లక్షల సం ఖ్యలో వెల్లువెత్తుతాయి. ప్రభుత్వ ఉద్యోగానికున్న డి మాండ్‌ అలాంటిది. నోటిఫికేషన్‌ కోసమే నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అలాంటిది 1133 సర్కారీ కొలువులకు ప్రకటన ఇస్తే దరఖాస్తు చేసుకున్నది 337 మంది మాత్రమే. ఇదీ రాష్ట్రంలో డాక్టర్‌ పోస్టుల పరిస్థితి. తెలంగాణ వైద్య విధానపరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1133 వైద్యుల భర్తీ కోసం ప్రభుత్వం ఈనెల 4న నోటిఫికేషన్‌ ఇచ్చింది. టీఎ్‌సపీఎస్సీ ద్వారా భర్తీచేస్తే నియామక ప్రక్రియ ఆలస్యమవుతుందని భావించిన ప్రభుత్వం నేరుగా భర్తీ చేసేందుకు జీవోను కూడా విడుదల చేసింది. 1133 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుకు మే 4న తుది గడువుగా నిర్ణయించింది. అయితే, నోటిఫికేషన్‌ విడుదల చేసి 15 రోజులు గడిచినా ఇప్పటివరకు 337 దరఖాస్తు లే రావడంతో ప్రభుత్వం కంగుతిన్నది. గడువు ముగిసే సమయానికి పోస్టుకు ఒక్క దరఖాస్తు అయినా వస్తుం దా? అనే అనుమానం తలెత్తుతోంది. నోటిఫికేషన్‌ జారీ చేసిన పోస్టులన్నీ స్పెషలైజేషన్‌ పరిధిలోనివే. వీళ్లకు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో భారీ డిమాండ్‌ ఉంది. అక్కడిచ్చే ప్యాకేజీలతో పోలిస్తే ప్రభుత్వాస్పత్రుల వేతనాలు తక్కువగా ఉండటంతో దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

వైద్య శాఖలో 432 పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌
వైద్య, ఆరోగ్య శాఖలో డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కింద 432 పోస్టు ల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 108 అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ పోస్టులను వెయిటేజ్‌ ఆధారంగా ప్రజావైద్య సంచాలకులు సెలక్షన్‌ కమిటీ ద్వారా నేరుగా నియమించుకోవచ్చని, మిగిలిన 324 మంది సిబ్బందిని టీఎ్‌సపీఎస్సీ ద్వారా భర్తీ చేసుకోవాలని పేర్కొంది. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన 54 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీహెచ్‌సీకి ఇద్దరు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లను నియమిస్తారు. ప్రతి పీహెచ్‌సీకి 4 చొప్పున 216 స్టాఫ్‌ నర్సు పోస్టులు, 54 గ్రేడ్‌-2 ఫార్మాసిస్టుల్లో పీహెచ్‌సీకి ఒకరు, 54 ల్యాబ్‌ టెక్నీషియన్లు గ్రేడ్‌-2 పోస్టుల్లో పీహెచ్‌సీకి ఒకరిని నియమించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.

జగన్-పవన్’ కొత్త సినిమా త్వరలో విడుదల

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కొత్త తరహాలో సోషల్ మీడియాని వాడటం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా ఏ పనైతే చేస్తున్నారో.. అదే తరహాలో కౌంటర్ అటాక్ చేసేందుకు గల్లా జయదేవ్ సిద్ధమయ్యారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూసిన ఎవరైనా ఇదే చెబుతారు.

ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏమిటంటే.. ‘‘జగన్-పవన్ అనే సినిమా త్వరలో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి కథ-దర్శకత్వం ప్రశాంత్ కిషోర్. నరేంద్ర మోడీ-అమిత్ షాలు మోడీ-షా ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నారు’’.. అంటూ గల్లా జయదేవ్ తన ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.